Sunday, September 29, 2019

మానవజీవన వికాసకావ్యము - ఐతగోని వెంకటేశ్వర్లు

మానవజీవన వికాసకావ్యము 
ఐతగోని వెంకటేశ్వర్లు, నల్గొండ


మానవజీవన వికాసకావ్యము
మొదటి ఆశ్వాసము రైతు
1)భూమిన్ సారపు బూమమైచనగ సంపూర్ణించి పూర్ణండునా
స్వామీ సృష్టిని మాయయంత్రమున విస్తారమ్ముగాఁగూర్చుచున్
రామంబొప్పగఁజేయ జీవతతులున్ నానాటికిన్ హెచ్చగా
నేమంబొప్పగ చాలవాయె సహజానేకంబులాహారముల్

2) శాకాహారులు వెర్గ శాకములహో చాలంగ లేకుండ నా
శాకాహారుల లేమిఁజేసి యిక మాంసాహారులుంబిమ్మటన్
వీకన్మానవ జాతినీల్గ పయినన్ వేగమ్మ క్షుద్బాధతో
లోకాలోకనమిట్లుఁజేసి ప్రభుడీ లోకంబురక్షింపగా

3) సాజమ్ముల్ క్షితి క్షీణమై చను పలాశమ్ముల్ పదార్థమ్ములున్
రాజిల్లన్ క్షితి సారపూరమగుచున్ వైళమ్ము బీజమ్ములే
నైజంబొప్పగ భూమిఁజీల్చి పెరుగన్ వర్దిల్లుటల్ సూడగన్
రాజీవాక్షుచేసి మానవమదిన్ నాటంగనే యోచనన్
4)వాడున్ రాతిని ద్రవ్వి భూమి నిటులన్ బాటించి బీజమ్ములే
గాఢాసక్తిని నాటి కొన్నిదినముల్ క్ష్మాఁజీల్చుచున్ బీజముల్
నాడుంగాంచెను చిన్ని మొల్కలు పయిన్ క్షాజమ్ములై వర్దిలన్
చూడంగన్ వ్యవసాయమున్ సలుపగా శోధించె తానాయెడన్

5)రాతింద్రవ్వుటయైన ఆదశను శీఘ్రంబేల వేలేండ్లకే
నా తిప్పల్ పెను ముప్పులెన్నొ క్రమమున్ దాటంగఁదానాగలిన్
జేతంబట్టె తయారుచేసికొని యీచిత్రంబు వీక్షించుచున్
భూతానేకము తృప్తినొందగను దాబూనెన్ దగన్ సేద్యమున్

6) మందీమార్బలమేరుపర్చుకొని సంరక్షించుచున్ వారికా
నందంబున్ ఘటియించనన్నమిడగా నందంబుతో వారలున్
కొందర్సాయము చేసి కూలిపనిచేకొంటున్ విలాసమ్ముగా
మందల్మందలుగాగ మానవులు శ్రీమంతమ్ముగా భూమియే

7)సస్యశ్యామలమౌచు వర్షములచే క్షామంబులేకుండగా
సస్యంబుల్ దగపండవండి తినుచున్ సౌభాగ్యసంపూర్ణులే
దాస్యంబుల్ దగచేయకొండొకరు సత్యస్ఫూర్తి దీపించగా
నాస్యాబ్జంబుల ప్రేమరస్యముల నాహ్లాదంబు జీవించుచున్

8) ఏదైన్యంబులనందకే గడపగానెన్నేనియున్ వేలు నా
హ్లాదంబిచ్చుచు సాగిపోయె వ్యవసాయంబిట్లు నాపిమ్మటే
నాధాత్రిందరుగంగ సారమపుడే నభ్భూమిలో సాజముల్
గాదే కుళ్ళిన యాకులెల్ల విడవంగా గొన్ని వేలిట్టులన్

9)జరిగెన్ సేంద్రియమైన యట్టి యెరువుల్ సల్లంగ సల్లంగనే
నిరవందన్ మరి పంటపండె బలమేనెంతేనియున్ బొంది దా
ము ఋజాగ్రస్తులు గాకనాప్రజలు సమ్మోదంబుతో జీవితాల్
పరగంగడ్పిరి గాని పెర్గ జనతాభారంబు దోరంబుగన్

10) క్రమమున బావులందునను గల్గినయట్టి జలంబు మోటలన్
దమదమ శక్తిఁదోడగను దాన ఫలించెడునట్టి పంటలే
దమకు లభించకే ప్రజలు రాలిరి యాకలిఁజింతకాయలై
యమరిన భోగభాగ్యముల హ్లాదముతోడఁబ్రభుల్ సెలంగగా

11) దొరలు జమీందారులకే
కొరతలు లేకుండఁగల్గెఁగూడుల్ గూడుల్
మురిపెపు దీపములారుచు
నిరయపుఁజీకటి బ్రతుకుల నీల్గిరి రైతుల్

12) ఇంతనాంగ్లేయ పాలకు లిట్టెవచ్చి
వర్తకమ్ముల నెపమున వర్తనమ్ము
సేసి యీదేశ ప్రభులలోఁజిచ్చుఁబెట్టి
యాక్రమించిరి దేశంబు వ్యాధులవలె

13)ఇచట వాణిజ్య సేద్యంబునింతలంత
లుగను పెంచి ముడిసరకులగణితముగ
వారి దేశంబు గొనిపోయి వస్తువులను
ఇచటకే తెచ్చి అమ్ముచునెంతముంచ

14) ప్రజల కూడుకు వలసిన పంటలిట్లు
దరగి పోయెను ఫలముగా దైన్యమునను
మ్రగ్గ దారిద్ర్య దేవి యమానుషగతి
మ్రింగుచుండగ ప్రజలెల్లఁగ్రుంగు చుండ్రి

15) స్వాతంత్ర్యంబును పొందుభారతములో సౌకర్యముల్ వెర్గగా
నాతండొక్కడు స్వామినాథు వ్యవసాయంబున్ బ్రవర్దంబుగన్
జేతోమోదము దోడ విప్లవముగా జేయంగ, యంత్రాల సం
జాతంబుల్ వ్యవసాయమందుఁగలిగెన్ సంపన్నమౌ పద్ధతుల్
16)హెచ్చు దిగుబడి పెరుగగా ఈప్రజలకు
కూడు పెట్టగా సహజాలు పాడుపడగ
సంకరణవిత్తనాలవి సంక్రమించె
కృత్రిమపుటెరువులు భూమి నెంత చెరిపె

17)వరి యన్నంబది యెన్న సున్నయని యాపల్నాటి సీమందగన్
వర శ్రీనాథుడు నాడుదూరె మరి యీనాడిట్లుసాంకేతికా
వరవిజ్ఞాన ఫలంబునెల్లెడల బువ్వందింటునింటింటిలో
నరయంగా ప్రజమూడుపూటలనిటుల్ నందంబుతోనుండగా

18) దగ కొన్ని వత్సరాలకే
మిగుల రసాయనపుటెరువు మించన్ వంచన్
భగభగమండెడి రోగాల్
భుగభుగ పెంచగ బ్రతుకులు బూడిదవోలెన్

19) ఐనఁ గూడుఁదినక ప్రాణాలు నిల్చునే
యనుచు ప్రజలుఁదినుచు మనుచు నుండ
పడగరాని పాట్లు వ్యవసాయమందున
పడుచు రైతులిట్లు వరలుచుండ్రి
20)రైతే రాజ్యమునౌను వెన్నుముఖ మేలందింపగాఁబూని మే
మేతీరున్ సరి ఆదుకొందుమని సంప్రీతిన్ విలోకించుచున్
మోతల్ మ్రోయగఁబల్కి నాయకులుఁదామో ఓట్లుగొంచున్ భళే
యాతర్వాత ప్రభుత్వమంది మరువంగారైతు దీనుండగున్

21)మరి యీ  రైతులు దామే
మరచిన పాలకులఁగూర్చి మరి పట్టకనే
భరమైనను వరమైనను
త్వరగా వ్యవసాయమిట్లు దామొనరింపన్

22) ఊరున్ వీడక ప్రేగుబంధమనగా ఉ చ్ఛ్వాస నిశ్వాసమీ
యూరే యంచును భూమిదున్నుచును ఎంతో లాభమాశించకే
నైరాశ్యంబునఁగూరుకోక బ్రతుకన్ నష్టంబు లేకుండగా
నౌరా తిండికి ఖర్చుకెల్ల సరియే నంచున్ మహాప్రీతితో

23) తెలతెలవారగ లేచుచు
తెలివిని కోల్పోవు కోడి తెలివి గలుగుచున్
తెలవారెడి వేళ యనుచు
తెలిపెను రైతంచు కూయదే చూడంగన్

24) ప్రొద్దునఁబోవ వానిసతి పోవును పిల్లలు పోవగా బడుల్
సద్దులు సిద్ధమేర్పరచి చయ్యన నాపయి భర్త కోసమై
సద్దిని కొంచునొద్దికగ చక్కగ నాపొలమందు ఆగకే
నద్దియె రాత్రిగాగనిక అప్పుడు వత్తురువీడుచున్ గృషిన్

25)ఇట్టుల వ్యవసాయమ్మును
చెట్టలు పట్టుచు సలుపుచుఁజేయన్ జేలన్
బట్టెడి చీడకు మందులు
గొట్టుట మొదలును ఎరువులు కొనుటము కొరకై

26) ఫలియింపంగను వేయ పంట; ధనమున్ వ్యాపారులంజేరుచున్
తలతాకట్టును పెట్టి యెట్టులటులో దార్గొంచు స్వేదమ్మటన్
జిలుకన్ కండలు పిండిగాగ కృషినే చేయంగ దైవమ్ము దా
నొలుకం బ్రేమము నప్పుదీరి తినగానోయయ్య దాన్యమ్ములే

27) మిగులంజాలని తృప్తినందు ముదమే మించన్ మదిన్ నించగా
దగ పోషింతును భార్యఁబిల్లలననన్ దైన్యంబుఁబోనాడుచున్
పగతోఁగాలము గాలమైన సమయంబందున్ గృషిన్ నష్టముల్
మిగులంగల్గిన వడ్డినడ్డి విరువన్ మేల్గూర్చనే నాథుడే

28) గలుగంజాలక వడ్డివాడు నెదురంగారాగ నావడ్డినే
కలుపంగానసలందు నిట్లు ఋణమే కాసింత కాసింతయై
దలపన్ వామన పాదమట్లు పెరగన్ దద్ఘాతమున్ భూమినే
నిలుపంజాలక అమ్మలేక వ్యథచేనేచేయుటో దోచకే
29)పొలమయ్యో పొలిభూమిగాగ నరె విస్ఫోటమ్ముగాఁబ్రేలు చె
డ్పుల సేద్యమ్మున నాఋణంబిటుల నాలోలించ లాభమ్మొకో
తలపోయంగను లేదు నాకనుచు నంతన్ స్వీయ హత్యాగతుం
డిల యీభారతమందు రైతులగుటేనేమందు మామూలగున్

30) మాడిరి రైతులిట్టులను మధ్య దళారులు నింతలంతలౌ
వేడుకలందుచుండి వినువీథులనంటెడి భోగభాగ్యముల్
వాడక పొంది తాము విషవంతము సేసిరి యెల్ల వస్తువుల్
పాడయె కృత్రిమంబులగు పద్ధతులన్ ధర సేద్యమందుచున్

Saturday, September 28, 2019



ఐతగోని వెంకటేశ్వర్లు విరచిత
రాధేశ్వరా శతకము

1) శ్రీమచ్ఛంకర శ్రీహరీ ద్వయులుగా చెన్నొందు చిన్మూర్తి శ్రీ
రామా భక్తమనోభిరామవిలసన్మందారదామేశ్వరా
సోమఃకోటి సుధామయాస్యరుచిమచ్ఛోభాయమానేశ్వరా
శ్రీమత్పద్యములందు గానమగుమా శ్రీకృష్ణ రాధేశ్వరా

2) నీలోనీవయి నీవుగాని ప్రకృతిన్ నీవౌచు భాసిల్లుచున్
గాలాతీతుడవయ్యుఁ గాలమయి సంఖ్యాతీత బ్రహ్మాండముల్
నీలోతత్వమునందు బుద్భుదములై నీ చేయకే చేయుదో
శ్రీ లీలామృత తత్వదేహ ప్రణతుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

3) ఏగానంబున నిన్ను నేను ప్రభువా యే
 రీతిఁగీర్తింతురా
నీ గానంబున నీదు నిత్యసఖియౌ నీదేవి శ్రీరాధతో
రాగాలాపన జేయునట్టి విభుడా రాజీవనేత్రుండ నీ
శ్రీగానంబును గ్రోళు భాగ్యమెపుడో శ్రీకృష్ణ రాధేశ్వరా

4)ఆనందంబున వేణువూదుచును విద్యాదేహముందాల్చి ని
ర్వాణంబై మను నిత్యగూఢ పదముంభాసించు భద్రాత్మకా
నానాజాండములెల్ల నొక్క క్షణమున్నవ్యంబుగా లీలగా
శ్రీనిత్యా తగురీతి జేసెదవయా శ్రీకృష్ణ రాధేశ్వరా

5)శతశృంగాద్రి పరీవృతంబు విరజా స్వచ్ఛప్రవాహంబులున్
సతముందావులు సల్లు గల్పవనముల్ సత్సారసంపూర్ణముల్
రతనోద్భాసిత రమ్యసౌధములతో రాజిల్లు గోలోకమున్
శ్రితకల్పద్రుమమైన నీకు ప్రణతుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

6)యతులై జ్ఞానులు నిన్నుగొల్తురు తురీయానందమే చింద స
న్మతులై యోగసమాధియందున చిదాత్మానందవారాశిలో
నతిమోదంబునఁ దత్వమత్తులగుచున్ హంసోహమాదివ్యమౌ
స్థితినే వీడక వెల్గుచుందురు ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

7) నీయూహల్ నినుఁ గీర్తిసేయు వచనాల్ నీ గానమున్ ధ్యానము
న్నీయుత్కృష్టపు దివ్య భవ్య చరితంబీభక్త వాత్సల్యమున్
నాయూపిర్ధర నిల్చునంత వరకున్ నాజన్మ ధన్యంబుగన్
శ్రీయుద్భాసిత సన్నుతించెద ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

8) బహు శాస్త్రంబుల జ్ఞానపూర్ణుడగుచుంబ్రజ్ఞా విశేషమ్ముతో
నిహలోకంబున భవ్యమౌ ప్రవచనాలింపారగా సేసినన్
బహు జన్మంబుల ఘోరపాపతతులన్ భగ్నంబుగాఁజేయు నీ
స్పృహ లేకంజరియించ వ్యర్థుడె కదా శ్రీకృష్ణ రాధేశ్వరా

9)కాళీయుంబయి నాడిగర్వమడచంగళ్యాణరూపంబుతో
లీలన్ శ్రీనటుభంగి నృత్య విలసచ్ఛ్రీతత్వ చిన్మూర్తివై
కాలాకాల విధాతధాతవగు విజ్ఞానామృతాంబోధి నీ
శ్రీలీలావిభవంబు నెన్నగలనే శ్రీకృష్ణ రాధేశ్వరా

10) రామా దుష్టకబంధరాక్షసయమా ప్రజ్ఞానరత్నాకరా
నేమంబంచని శిష్టరక్షణమునొందింపంగ ఘోరాటవిన్
లేమన్గూడుచునేగి సాధుజనులా శ్రీమాన్యులౌ మౌనులన్
బ్రేమందారకమిచ్చి బ్రోచితివయా శ్రీకృష్ణ రాధేశ్వరా

11) సిరితో శ్రీహరివౌచు  పాలకడలిన్ శ్రీపార్వతీశుండవై
వర కైలాసమునందు వెల్గెదవు భావాతీత భావింతునిన్
బరమవ్యోమ మహోజ్వలోజ్వల భవత్ప్రాచుర్య శ్రీలీలలన్
స్థిర గోలోక విరాజితుండవనుచున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

12) నీకే మాలను వైచెదన్  ప్రభుహరీ నీమాలకేమాల యీ
లోకంబందున సాటిమేటియగు నాలోకింపగా లోకువే
శ్రీకాంతా యిక వైచెదన్ మది భవల్లీలల్సుమాలల్వలెన్
శ్రీకైవల్యపదేశ ప్రీతిఁగొనుమా శ్రీకృష్ణ రాధేశ్వరా

13)కవులై యామృగతృష్ణ నీరు కరణిన్ గావ్యాలభావంబుగా
నవనిందత్వవిచారచారులగుచున్నవ్యక్తమీవందురే
యెవడో ధారుణిఁగోటి కోటియుగముల్ దృష్ణాత్తునిన్గాంచెనో
శివతత్వంబని యెంచినాడొ ప్రభువా శ్రీకృష్ణ రాధేశ్వరా

14)భూమిన్ లీలగ నెత్తితీవు ప్రభువా పూబంతియౌ లీలగన్
నేమంబార్తుల రక్షయంచు గిరినే  నీనూపురంబుంచితే
కామోద్రేకులకియ్యకుండ సుధలంగందర్పకోట్యాధిక
శ్రీమత్సుందరమోహినీరుచివినౌ శ్రీకృష్ణ రాధేశ్వరా

15)నీనోముల్దగనోయలేను ప్రభువా నేనెప్డుసన్నిష్ఠతో
కానీ నీచరితంబు విన్ననదియే కైవల్యమున్మించుచున్
నానందంబయి రోమహర్షమగురా ఆహ్లాదినీ సంయుతా
శ్రీనాదస్వరయోగరాగ కలితా శ్రీకృష్ణ రాధేశ్వరా

16) తానే తారకమంత్రరూపుడగునా దైత్యారి శ్రీకృష్ణుడే
పూనెన్ ధారుణిమానవుల్ పశువులై పోకుండ ప్రజ్ఞానులై
వీణాపాణిని నిత్యపుత్రులగుచున్ విజ్ఞానముంగ్రోళగన్
శ్రీనిత్యామృత గీతనిచ్చె ముదమున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

17)శ్రీదేవా వర వేంకటాద్రి పయినన్ చిన్మూర్తివై వెల్గుచున్
నీదృగ్జాలముఁబాప జాలములనే నిత్యంబు ఖండించ మ
మ్మాదివ్యాధి విముక్తిసేసెదవు నిత్యానందమున్ మున్గుచున్
సేదల్దీరగ చింతమానెదమయా శ్రీకృష్ణ రాధేశ్వరా

18) ఆహా నీనగు మోము దివ్యసుధలేనాగోపికల్ గ్రోళుచుం
డోహోహో గడుతన్మయత్వ హృదులై యుత్కృష్టమౌ యోగమున్
సోహంబైచను శుద్ధసిద్ధి గలుగన్ శూన్యంబు చిత్తంబులై
శ్రీహంసల్గను వెల్గుచుందురెపుడున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

19)ఆవైకుంఠుడె రామచంద్రుడయి తానాత్మస్థమౌ మాయచే
తావైచిత్ర్యము గాదె మానవుడునై తాఁదాను మైమర్చుచున్
జేవల్ జీవితమందుగానక నటంజింతించుచున్నప్పుడే
శ్రీవాశిష్ట్యము వుట్టి వెల్గులిడదే శ్రీకృష్ణ రాధేశ్వరా

20)ఇలలో నీపయి భక్తి గల్గి  వరుడై యింపైన గానాలచే
శిలలంగర్గగ సేసి ప్రేమమయుడై సిద్ధాంతపున్ యుద్ధముల్
నెలకొల్పంగననిష్టముల్గలుగుచున్ నిర్నిద్రయోగంబునన్
చెలిమల్దత్వములూటలూరును గదా శ్రీకృష్ణ రాధేశ్వరా

21) ఈమాయన్ ధర దాటలేను   ప్రభువా హృత్పద్మ తత్వార్క చి
ద్వ్యోమంబందున గూఢతత్వ కలితా యోగీశ దివ్యేశ హే
స్వామీ జీవహృదంతరాత్మ పరుడా బ్రహ్మాది సంసేవితా
ప్రేమంగావుమచింత్య ముక్తిపదమా శ్రీకృష్ణ రాధేశ్వరా

22)ఈరంగంబున లోకభోగములనే నింపారగాఁగుడ్చుచున్
వీరంగంబులు సేయుచుందురకటా భేదస్వభావాలతోన్
గోరంగన్నిను మర్చి వ్యర్థ ధనులై నొప్పించి పుణ్యాత్ములన్
శ్రీరంగా పరమందకోర్కి విడిరో శ్రీకృష్ణ రాధేశ్వరా

23)నానాయోనులపుట్టుజీవతతులన్ బ్రహ్మండముల్ గూల నీ
స్థానంబిచ్చుచు గాలరాత్రి గడువన్సాలోకముల్ సేయుచున్
వాణీశుంబ్రభవింపఁజేయుచును నవ్యంబైన నీలీలలన్
శ్రీనారాయణ సృష్టికై నిలిపెదో   శ్రీకృష్ణ రాధేశ్వరా

24)నేరంబుల్ ద్యజియించి నిష్ఠహృదుడై నీభక్తుడై ధన్యుడై
నీ రమ్యంబులు దివ్యలీలలు సుధల్ నీ గానమున్ ధ్యానమున్
గోరంగందను ధన్యుడౌచునఘముల్గూలంగనుందాను నిన్
జేరున్ నీదువిశేషరక్షవలనన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

25)కాలాడోలికలూగుచుంటివ ప్రభూ కాలాత్మకా లీల నా
పాలాంబోధినిఁబవ్వళించెదవ అద్వైతానుసంధానమున్
నీలీలా మధుపానమత్తులగుచున్ నిష్ఠన్భవన్నామమున్
శ్రీలొల్కన్స్మరియించ పార్షద వరుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

26)నీవే గమ్యము నీవె సత్యమనుచున్ నీదివ్యమౌలీలలే
నేవేళైనను నిక్కడక్కడనకే హృద్వీణ మ్రోగంగ నా
కైవల్యంబును గోరకుండ ధరయే కైవల్యధామమ్ముగా
చేవల్గల్గగ వెల్గ పాడెద ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

27) ఇలలో నందుని యింటబాలకుడవై యెన్నిన్ని నీలీలలన్
దిలకింపంగనుఁజేయ గోపజనులుందృష్ణావిదూరాత్ములై
నిలిపిర్నీమధు తత్వరూపు హృదులన్ నిష్కామయోగాత్ములై
చెలగిర్నిత్యము నీదు దర్శనమునన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

28)అనిశంబున్ నిగమాలు వందిగణమై యాచిన్మయాకాశమున్
మనమున్బుద్ధియుఁజేర రాని స్థలిలో మాయాంతమైవోవగా
కననజ్ఞానము దూరమైన హృదిలో కైవల్యమై వెల్గు చ
క్రి నినున్ నాహృదయాభ్రమందుఁగనెదన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

29)తరమా నాకిల నీదువర్ణనము విస్తారమ్ముగాఁజేయగా
వరులౌ యాసనకాది దివ్య మునులే భావింపలేమన్న ని
న్నరయంగాని నిగూఢపుణ్యబలమందాహ్లాదినీ సంయుతా
స్థిర దీక్షమ్మున సంస్థుతించెదనిలన్  శ్రీకృష్ణ రాధేశ్వరా

30)సారంబీవని సర్వయోగులిలలో సాధించగంబూనుచున్
బారావారగభీర నిష్ఠ పటిమన్ బ్రహ్మత్వ సంప్రాప్తులై
సారోదార విశుద్ధతారకములో జ్ఞానాత్ములై మున్గుచున్
శ్రీరామంబగు ముక్తిగాంతురు ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

31)రేయింబ్రొద్ధులు లోకభోగములకై శ్రీకారముల్సుట్టుచున్
మాయాసాగరమందు మున్గెదము సంప్రాప్తించు సౌఖ్యాలకై
కాయభ్రాంతినిఁజిక్కినాము జవమౌ గాలంబు గాలంబులో
శ్రేయోదాయిని గావు రాధ జననీ శ్రీకృష్ణ రాధేశ్వరా

32)కృష్ణుండన్నను వ్యక్తి గాడు వినుడీ యీశుండుగా జ్ఞానులౌ
తృష్ణాత్ముల్ నిరతంబుఁగొల్చు పరుడై దేదీప్య హృత్తేజమై
నిష్ణాత్ముల్గనుఁజేసి భక్తహృదులన్ నిండార వెల్గొందు శ్రీ
జిష్ణుండాది విభుండుఁదత్వమనుచున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

33)ఆయాగాలములందు భక్తులను నీవాశ్చర్యమౌ లీలలన్
హాయింగాచితి భక్తబంధి వగుచున్నాపన్నసంరక్షకా
మాయామేయమునైన యీజగతిలో మందార వృక్షమ్మవై
శ్రేయంబుల్దగు రీతిఁగూర్చుమ ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

34)శుద్ధంబైనటువంటి ప్రేమ పటిమన్ శోధింపగాకుండుచున్
మొద్దుల్ నిద్రలు వీడలేక భువిలో మోహంపుభోగంబులే
నెద్దుల్ వోలెను మేయుచుండెదము మా  హృన్మాయ భేదించుచున్
సిద్ధుల్గల్గగఁజేసి గావుమ ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

35)సుఖివై భద్రతనూ విలాసుడవునై శుద్ధాత్మవై సత్యమై
నిఖిలాధారుడవై నిరామయుడవై నిర్గ్రంథ రక్షుండవై
యఖమై సంసృతి మాయవృక్షమునకున్ స్వాంతాలయోద్భాసివై
శిఖి ఫించంబున వెల్గునీకు ప్రణతుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

36)అమ్మో ధారుణి ధ్యానయోగినయినన్ వ్యామోహజాలమ్ములో
సమ్మోహంబునఁజిక్కఁజేయుచు నశశ్వద్భోగ భాగ్యమ్ములే
నిమ్మేయంచును నొందఁజేయును గదా యీమాయ మాయేశ్వరా
చిమ్మంగన్ దయ మమ్ముఁబ్రోవుమ ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

37)నీడై మృత్యువు వెంటనంటు దెలియన్ నీపైని సద్భక్తి నే
నాడైనన్దగ  గల్గునట్టి నరులన్ జ్ఞానామృతంబిచ్చుచున్
దోడైగాచుచు దివ్యయోగమిడుచున్ మోక్షంబునందించు నీ
క్రీడల్ చిత్రవిచిత్రమంచుఁదలతున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

38)స్థాయీ భేదము మర్చి నీవు ధర దుశ్చారిత్రులంగూడితో
ఓయీ చూడగ  గార్దభంబు వలెనే నూహింపగా నద్ది నీ
శ్రేయంబంతయుఁగూల్చి వంచు మిగులంబ్రీత్యాత్ములం బుణ్యులన్
జేయూతంగొను వారిఁజేర ఫలమౌ శ్రీకృష్ణ రాధేశ్వరా

39)అంతన్బ్రహ్మము నిండి వెల్గుననుచున్ ధ్యానప్రపూర్ణాత్ముడై
యెంతో సెప్పగ రాని తన్మయతతో నెవ్యారి యందేనిలన్
సంతోషమ్మునఁగాంచి బ్రహ్మము నినున్ జన్మంబు ధన్యంబుగాఁ
జింతల్లేకను భక్తుడౌచు వెలుగున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

40)ఆజన్మాంతము దీనసేవ కొరకై యశ్రాంతమారాటమై
రాజీలేకను సేవసేయు వ్రతమున్ లక్ష్యంబుగా దాల్చనై
నైజంబందున శుద్ధసత్వుడగు పుణ్యాత్మున్ నరోద్ధండునిన్
జేజే లంచని సన్నుతించెదనిలన్   శ్రీకృష్ణ రాధేశ్వరా

41)శంకా సంకుచితాంతరంగములతో జన్మాంతమున్ భేదమం
దింకింకింకను గూలుచున్ పరుల తానెంతో విదూరంబనన్
సంకోచంబుననెట్టి కార్యమయినన్ సాధింప గాకుండగా
శృంఖంబయ్యిన జీవితాన మనడే శ్రీకృష్ణ రాధేశ్వరా

42)నానా యాతనలందుఁద్రోయ జనులన్ నల్గొండలో ఫ్లోరినే
కానంగన్  గ్షయమయ్యె పళ్లు మొదటంగాల్జేతులున్ వంగగన్
హీనంబాకృతినైరి యాపిదప తామిభ్భూమికే నత్కుచున్
క్షీణించిర్మరి బాల వృద్ధులగుచున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

43)కాకుల్దూరగ రాని కారడవులంగన్పెట్టి యీమానవుల్
తూకంబుంచిరి ద్రవ్యసంచయము సంతోషంబు మాకంచహో
శోకాగ్నింబడఁద్రోసి జంతు తతులన్ స్రుక్కింపగాఁజేసినన్
శ్రీకారమ్మది తాము లుప్తమగుటల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

44)మాగాణంబులు బీడు వారగనునంబా యంచు రైతన్నలే
నాగే మగ్గము మృత్యు పాశముగ నయ్యయ్యయ్యొ నేతన్నలున్
సాగీసాగక యప్పుదీర దనుచున్ జాలించిరే దేహముల్
శ్రీగూర్పంగను బూనుమింక ప్రభుతా శ్రీకృష్ణ రాధేశ్వరా

45)ధరలో నిప్పుడు వృద్ధి కోసమని విస్తారమ్ముగాఁగూల్చగా
దరువుల్ దర్గినకారణంబునను అస్తవ్యస్తమై మానకే
కురియున్ముంచుచు కుంభవృష్టి యొకచో ఘోరంబులాతాపముల్
చెరుపున్ గ్షామముఁజేతనింకనొకచో శ్రీకృష్ణ రాధేశ్వరా

46)ధీగాంభీర్యముఁగల్గు వాడునెపుడున్ దీపించి లోకమ్ములో
వాగాడంబరశూన్యుడౌతు హృదిలో భాసింప జ్ఞానంబు స
ద్యోగమ్యుండయి సాధుభావ మయుడై తుష్టుండు నిష్ఠుండునై
శ్రీగూరంబరితృప్తుడౌచు  వెలుగున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

47)తన ద్రవ్యంబులు పంచకున్న తనదౌ ధర్మంబు పాలించుచున్
గనగానర్థుల సూచనంబులిడుచున్ గర్తవ్యముల్ దెల్పుచున్
గొణగుల్లేకను నీసడించుకొనకే కూర్మిన్ బ్రదర్శించుచున్
జినుడై వెల్గెడి వాడు ధన్యుడిలలో శ్రీకృష్ణ రాధేశ్వరా

48)నాలాలందున నీరుపొర్లి మురికిన్ నల్దిక్కులన్ జిమ్మగా
చాలన్ స్పష్టము భ్రష్టభాగ్యనగరిన్ సంచారముల్ దుఃఖముల్
గూలెంబ్రత్కులునంటురోగములచే ఘోషింపగా గొబ్బునన్
శ్రీలుప్పొంగక నీల్గిరా గిరిజనుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

49)నీడై మృత్యువు వెంటనంటునకటా నీలీలలేమందురా
మోడుల్ వృక్షములున్ గబేలపశువుల్ పోపోపొ మిన్నయ్యెడిన్
గాడుల్గూడులు వల్లకాడులయి చింతాచితిన్ గూల నీ
క్రీడంబేదలు నీకు పావులయిరో శ్రీకృష్ణ రాధేశ్వరా

50)కాలున్ మంటినినంటనీయకనువిఖ్యాతిం ధరంగొందరీ
వేళంగానగనాకసంబు కుసుమంబే కొండ మీదున్నదా
లీలామర్కటమంద గంజి కరవై రెక్కాడ డొక్కాడకే
రేలున్ బ్రొద్దులు కొందరుండ తగవే శ్రీకృష్ణ రాధేశ్వరా

51)మత్తున్మున్గిరి మానహీనులగుచున్ మైమర్చి లోకమ్ములో
చిత్తైచెల్లని రూకకన్న నధముల్ జీవచ్ఛవాలైమనన్
వత్తైకాలిరి యింద్రియాల సుఖముల్ పాపాగ్నియై రేగగా
జిత్తంబెప్పుడు శాంతినొందకకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

52)మధుమేహంబును గుండెపోటు రుధిరంబందయ్యహో పోటులున్
అదరే దేహముఁగీళ్ళ వాతముల నాహాకారముల్ గల్గగా
నిదిలేదంచని చెప్పనేల ధరలోనేవేవొ రోగంబులన్
జెదరెన్గూడులు గోడువెర్గనకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

53)మారీచుందలపించునట్టి మనుజుల్ మాయావులై కాములై
నారీజాతికి వెట్టిహింసలను అన్యాయంబునన్ బేదలన్
నేరాలందునమ్రగ్గఁజేసి బలిమిన్ నిత్యంబు చౌర్యంబులన్
బ్రేరేపించిరి కూటికోసమకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

54)ఆయుష్షుల్ ధర వృద్ధిపొందు వినుడీ ధ్యానంబు ధ్యేయంబుగన్
సాయంబిచ్చుట సాటివారికెపుడున్ జన్మాంతముంబ్రేమలన్
బాయల్ వారగఁజేయఁబూన హృదిలో వర్తిల్లునా దైవమే
చేయున్సాయము మీకునిక్కమిదియే శ్రీకృష్ణ రాధేశ్వరా

55)మోదంబంచని దేశముక్తి కొరకై పుణ్యాత్ములక్కాలమున్
బాధల్ సైచిరి ఖైదులౌచు విడిచిర్ప్రాప్తంబులౌ భోగముల్
సాదాసీదగఁగడ్పి జీవితములన్ స్వాతంత్ర్యసంగ్రామమున్
ఛేదించిర్భరతాంబ శృంఖలములన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

56)కూతల్గూయుచు స్వల్పకార్యములనే గోరంతకొండంతగన్
మోతల్మోయగ నమ్మఁబల్కి జనులన్ మోహంపుగాలంబునన్
నీతుల్మాలుచుఁజిక్కఁజేసి పిదపన్ నిర్లజ్జతోఁ గోటలన్
జేతల్దోడుతఁగాకఁగట్టెదరయో శ్రీకృష్ణ రాధేశ్వరా

57)మీచే జ్ఞానము ప్రాప్తమౌననుచు నమ్మీలోకమందెల్లెడన్
వాచామానస సత్యనిష్ఠుడగుచున్ బ్రార్థించి ధ్యానించి మి
మ్మాచార్యోత్తము డౌచు మీచరితమున్ సానందముంజెప్పుచున్
శ్రీచైతన్యముఁజిందులాడ వెలుగున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

58)మదిఁదల్పంగనుఁబ్రాణభీతికర కర్మాగారముల్ లెస్సగా
వదలే వాయువులన్నిచేరి యకటా శ్వాసవ్యవస్థందగన్
హృదయోన్నిర్గత రక్తమందుఁగలవంగెన్నెన్నొ రోగంబులన్
జెదలున్ బట్టిరి మానవాళి ప్రభువా శ్రీకృష్ణ రాధేశ్వరా

59)జనులారా వినరండి మీరు వనితల్ సత్సంపదల్ జాతికిన్
మనలంగన్నది అమ్మ యాడదగు సంభావ్యంబ దెల్పండహో
అనయంబున్ మరి బ్రూణహత్యనకటా యమ్మాయనన్ జేతురా
చినుకుల్ మాత్రము ప్రేమకుర్య భళియౌ శ్రీకృష్ణ రాధేశ్వరా

60)మేనుల్డస్సుచుఁదెచ్చునట్టి జలముల్ మృత్యుప్రహారమ్ములై
గానంజాలని రోగకారకములై కాలుష్యసంగ్రస్థమై
ప్రాణాల్ దీయును కొండజాతి జనులన్ స్వచ్ఛంబులౌ నీళ్లురా
శ్రీనాథా భరతంబునందుఁగఱవౌ శ్రీకృష్ణ రాధేశ్వరా

61)ఆవుల్ పాలనొసంగగాను ధరలో హార్మోనులెక్కించనా
యావుల్ పాలనుఁద్రావి బాలికలహో యైరే రజస్వల్ త్వరన్
భావింగనులేనివౌ విషములన్ బాధించు రోగాలచే
చేవల్దప్పి కళావిహీనులయిరే శ్రీకృష్ణ రాధేశ్వరా

62)పూటల్గడ్చిననద్ది చాలునని రేప్రొద్దంత తానొక్కడున్
వేటుల్వేయుచు మోసపూరితుడునై భేదంబు వాడొక్కడున్
మాటల్ దీపిగ కడ్పుచేదగుచు సంవాదంబునింకొక్కడున్
జేటుల్గానక సంచరించెదరిలన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

63)నీతుల్రంగని మించి సెప్పుచును మన్నింపంగ రాకుండగా
జాతిభ్రష్టపు జల్గలౌచునకటా జాత్యర్థముల్ పీల్చుచున్
మూతుల్నాకుచు నేను నేతననుచున్ మోసంబులుంబాపముల్
సేతల్మానరు మేడిపండులగుచున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

64)ఆచారంబుల పేర నక్కలవలెన్ స్వార్థమ్ముతోనీప్రజన్
నీచాత్ముల్ పరతత్వహీన ఖలులున్ బీడించి వంచింపరే
యోచింపగననూహ్యరీతులను-అమ్మో ధార్మికభ్రష్టులై
శ్రీచిద్భాసిత వారి మార్చుమ ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

65)ఏవో మెచ్చిన నచ్చినట్టి పనులేనింపారగాఁజేయుచున్
రావే శ్రీలని మిడ్కుటేల సఖుడా ప్రారబ్దముండంగ నీ
కావశ్యంబుగఁగల్గవే ఫలములీకార్యంబులీలోకమున్
శ్రీవిశ్వేశుని కేళిలీలలు గదా శ్రీకృష్ణ రాధేశ్వరా

66)పగలే వెన్నెల రేయియే పగలునై వర్తించునాబామలున్
సిగ పూలైనను ఇచ్చిపుచ్చుకొనుచున్ స్నేహంబులోఁజూడుడీ
జగతిన్ మాకునుఁదూగరెవ్వరని సత్సంబంధముల్గూలనా
సిగలే పట్టుకుపోరుసేదురకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

67)కలపుల్ సెర్చగ పైరులెండు ధరలో కల్లోలచిత్తోద్భవాల్
దలపుల్ సెర్చగ దుర్బలుండునటులౌ దార్ఢ్యంబులౌ గాలులున్
మెలికల్ ద్రిప్పుచు వృక్షజంతు ప్రకృతిన్ మృత్యోన్ముఖంబుల్వడన్
జెలరేగంగ మరేమిసేదుమకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

68)చాలన్ స్పష్టము నేలలోనిపుడహో సారంబువోఁజేయుచున్
గాలుష్యంబులకాలవాలమగుచున్ ఖండింపగాకుండుచున్
నేలంగుళ్ళని ప్లాస్టికే నిపుడనిర్ణీతంబుగా పేరగా
చేలన్జేవలు లేకపోయెనకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

69) చూడన్ సూక్ష్మపు తత్వదృష్టి గలుగన్ శోధించి యీదేహమున్
నాడీమండలసంస్థితంబులగుచున్ నానావిధాలైనవౌ
జాడల్ యోగపు మూలమర్మములు సంజ్ఞల్ మేధలోనుంచు నీ
క్రీడార్థంబులెరుంగమాకుఁదరమే శ్రీకృష్ణ రాధేశ్వరా

70)మరపుల్ లోకహితంబుఁగూర్చుటన సన్మానంబులంబొందుటం
దెరుకల్ సాయముసేయుటందు విడుపౌ నేచిన్నదౌ సాయమున్
మెరపుల్రీతిగముందెపొంది మదిలో మేల్గల్గగా పొంగుచున్
చెరపుల్గల్గిన దుఃఖమందరె ఖలుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

71)ముత్యంబుల్గను నొప్పుభాషణములన్ బుణ్యాత్ముడై మాన్యుడై
నిత్యంబాడుచు సాటివారి పయినన్ స్నేహార్థ్రతా భావముల్
సత్యప్రేమ రసాంబుధీయుతుడు సత్సౌజన్యుడౌ వాడు నీ
ప్రీత్యర్థంబమనస్కయోగము మనున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

72)కరముల్సేవ నిమగ్నమైదనర నిష్కామంబులౌ కర్మలన్
బరగంజేయగఁబోవు పాదములు నిష్పాపంబులౌ వర్తనన్
నిరతోపాయము గల్గి యుత్తముడునై స్నిగ్ధస్వభావంబునన్
శిరమున్వంచుచు నిన్నువేడు ముదమున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

73)బలవంతంబుగనైన యింద్రియములన్ వారించుసమ్మాన్యుడే
దలపోయంగను దివ్యయోగముల సత్సారంబులంబొంది ఈ
యిలలో కీర్తిసుకాంతకౌగిటను సంతృప్త్యాత్ముడై చేరుచున్
చిలుకై తత్వ ఫలంబులిచ్చు ధరలో శ్రీకృష్ణ రాధేశ్వరా

74)మత్తెక్కంగనుఁగ్రోళిమద్యమును సన్మానింపడే జ్ఞానులన్
జిత్తంబుంబిసరంత నిల్పడుగదా జీవేశ్వరుంజింత దా
చిత్తైపోవును ముందు కాలమున రాశీభూతదౌర్భాగ్యమున్
చెత్తైనన్ దగు శ్రేష్ఠమౌనతనికే శ్రీకృష్ణ రాధేశ్వరా

75)పదిలంబున్మన జీవితాన ధనముల్ ప్రాప్తించుటే చాలనన్
మదిలో దాల్చుచు సాహితీ వలువలన్ మత్తెక్కితీసేయుచున్
ఇదీయే కాలము మార్పటంచు పలుకంగీతెల్గు సాహిత్యమే
చెదలుంబట్టుచు క్షీణమౌచు నిలిచెన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

76)మనసా మానక తత్వమున్ మునిచెదో మాట్మాటికొక్కొక్కచో
అనయంబొక్కట వాదభేదములతో నానందముంద్రుంచుచున్
గనగానింద్రియలోలు సేసెదవు అజ్ఞానంబునంద్రుంచుచున్
చెనగన్నీవెటులోనెరుంగతరమా శ్రీకృష్ణ రాధేశ్వరా

77) సంకల్పంబునఁగల్గు యోగమనునీ సత్యంబునీవేగనన్
శంకల్గూలును సాధ్యమౌను ధరలో సద్భాగ్యముల్వొంద నీ
కింకాయేల విలంబనంబు సఖుడా యీమాయదాఁగట్టు నీ
శృంఖంబుల్దెగ ద్రెంచు యోగబలమున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

78)కాదే నీకిది సాధ్యమయ్య ధరలో కల్లోలముల్గూల్చగా
రాదే రాగము సాటివారినెపుడున్ బ్రాయోజితుల్సేయగా
లేదే దారది నిత్యచేతనముతో లీలా వినోదమ్ముతో
ఛేదింపన్మది వేష్టితంబులఘముల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

79) వేరై యొప్పెడి మార్గముల్ ధరణిలో వేవేలుగానున్న సో
దారంబైన విశేషయోగపటిమన్ తత్వజ్ఞులై దాల్పి ని
స్సారంబౌ భవబంధఛేదనమునన్ స్వాధ్యాయులౌ మానవుల్
చేరేగమ్యము దైవమొక్కటె గదా శ్రీకృష్ణ రాధేశ్వరా

80)లోకంబందున దీనసేవకొరకై లోలోనఁజింతించుచున్
సాకల్యంబగు జీవనంబు సనుచున్ సత్కార్యముల్ సేయుచున్
చీకాకుల్మరి గూల సాటిజనులున్ శ్రీమాన్యులై వెల్గగన్
శ్రీకారమ్ములు సుట్టువారె సుజనుల్ శ్రీకృష్ణ రాధేశ్వరా

81)మోజే యంచని లంచముల్ గుడుచుచున్ ముంచేయు భ్రష్టాత్ములీ
రోజారోజని యెంచకుండ ప్రజనాక్రోశింపగాఁజేయుచున్
బూజుల్గా మన దేశ భాగ్యములసంపూర్ణంబుగా సేయు వా
రే జేజేలను పొందుచుందురకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

82)మదిలో కోర్కెలు మాటు వేయగను సంభావ్యంబభావ్యంబులన్
జదువుల్ సారమెరుంగువారలయినన్ జ్ఞానాశులైనన్ సరే
హృదిదౌర్భల్య వశంబుతోడనకటా హృత్కామ్యముల్ పాపముల్
చెదలై పట్ట పశుత్వమొండె పడిరే శ్రీకృష్ణ రాధేశ్వరా

83)బుడగై కాల సముద్రమందు క్షణమున్ స్ఫోటించునీజీవితం
బిడు భోగంబులు స్వప్నతుల్యములుగా పృథ్విందగంగాంచియున్
వడిగా పాపపు కూపమందు వడగా ప్రాప్తించు సౌఖ్యంబులే
చెడు కాలంబునఁజేటు గావె గనగా శ్రీకృష్ణ రాధేశ్వరా

84)మేమున్నామని రామరక్షయని మీమేల్గూర మాకోట్లిడం
డీ మీనమ్మకమింత వమ్ము నిడమే దీవించుమిమ్మర్వకే
స్వాముల్మీరని సేవసేతుమని వేషాల్వేసి గెల్వంగనే
సేమంబర్యగరారు పాలకులునై శ్రీకృష్ణ రాధేశ్వరా

85)మోమోటింతయు లేకనన్నిటను అమ్మోకల్తి సేదుర్గదా
ఏమోమో యెరుగంగరాని విషమే యెంతెంతయున్ గల్పుచున్
బాముల్గల్గగఁజేసి యీ ప్రజకు దుర్వ్యాపార పారీణులై
శ్రీమంతుల్గను వాసిగాంచెదరహో శ్రీకృష్ణ రాధేశ్వరా

86)వ్యవసాయంబులు నష్టమౌచు రయితుల్ పండించునాచేలలో
నవసానంబులు వొందుచుండినను సాయంబేది చేకుండగా
నవనిన్ దేశములందు చిట్ట చివరన్ భ్రష్టాత్ములీ పాలకుల్
శివుడా నిల్పిరి భారతంబునకటా శ్రీకృష్ణ రాధేశ్వరా

87)కొంపల్గూల్చెడి వారె దేశమున సంకోచంబు లేకుండ దా
రింపుల్గల్గెడి రూపమిచ్చుచుఁదగన్ దృగ్మాయలంజేయుచున్
చంపిర్మందులఁగల్తి సేసి జనులన్ శస్త్రాస్త్రముల్ లేకనే
చెంపల్వెట్టులు గాదె మీకు ప్రభుతా శ్రీకృష్ణ రాధేశ్వరా

88)ఏమో లాభము మాట దేవుడెరుగన్నీదేశమందిప్పుడున్
సీమల్రక్షణ సేయు వృక్షతతులన్ క్షీణింపగాఁజేయుచున్
క్షామంబందగఁజేస్రి యంత్రములలో సంధిల్లగా వెట్టుచున్
రీముల్ కాగిత సృష్టి సేయుచు కటా శ్రీకృష్ణ రాధేశ్వరా

89)ఈశాస్త్రజ్ఞులు తిండినిద్రవిడగా నీరీతిగా లోకమం
దాశల్ పల్లకినెక్కి యెక్కి జనులున్ సానంద ముందోగరే
క్లేశంబుల్ మరి సేయకున్కి ప్రకృతిన్ క్షేమంబుగానుంచుచున్
శ్రీశాంతుల్వెద జల్ల మేలు గలుగున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

90)రాగద్వేషవిషప్రపూర్ణమయ సర్పాలౌతు ప్రస్థానముల్
వేగంబుంగొని లోకకంటకులు నిర్విఘ్నంగానెల్లరన్
భాగస్వాములఁజేసి దుఁఖములనే పాల్వంచుకొమ్మంచయో
రేగిర్గుప్తము గాను దోచి ధరలో శ్రీకృష్ణ రాధేశ్వరా

91)మనముల్ నిల్వవు విద్యలందరయ సంభ్రాంతెంతయుంగూడగన్
దినముల్ గడ్చును దూరదర్శిని వలన్ దిక్కారమే దిక్కనన్
దనరంజేసె కళాత్మకంబుగను అస్తవ్యస్తమౌ రీతులన్
సినిమా భారత జాతినిట్లుఁగనుడీ శ్రీకృష్ణ రాధేశ్వరా

92)నీతోడెవ్వరు నీకు రక్ష యెవరున్ నీదైనదీలోకమున్
మాతోఁజెప్పుడి మేము స్వాములమయా మమ్మీరు బ్రహ్మంబుగా
చేతోమోదితులై మనోధన తనుల్ సేవించరండంచయో
సేతుర్భ్రష్టపు బోధ మేలుగనుడీ శ్రీకృష్ణ రాధేశ్వరా

93)సాయంత్రంబును దాటి రేయి యగుటన్ సంభ్రాంతినాక్రాంతులై
హాయింబోదురె మద్యపానమునకై అయ్యయ్యొ మీకొంపలన్
బోయంజూదురె కాలకూటమును దుర్భుద్ధిన్ విసర్జించుచున్
సేయండో రణమింద్రియాల పయినన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

94)ఎముకల్ గుల్లగ మారునోయి వినుమా యీధూమ పానంబుచే
తమకంబందుర నాడి మండలము వధ్యంబౌచు మద్యంబునన్
విమలానందము మాదు పద్య మధువున్ విస్తారముంబోసెదన్
స్థిమితత్వంబునఁగ్రోళు మేలు గలుగున్ శ్రీకృష్ణ రాధేశ్వరా

95)అమ్మోభేదపు వ్యాఘ్రసంహతులు సంఖ్యాతీత సిద్ధాంతముల్
చిమ్మెన్ గ్రోళగ సాటివారి రుధిరశ్రీలన్ ధరామండలిన్
నమ్మే యామతమేదియైన నరులన్ నారాయణుల్ సేయుచున్
చెమ్మల్ ప్రేమలనూటలూర ఫలమౌ శ్రీకృష్ణ రాధేశ్వరా

96)పోరుల్సేసిరి రాజ్యవిస్తరణకై భూలాభవాంఛార్థులై
యేరోజైనను వాడి మోడులగుచున్ బృథ్విన్ బ్రజల్ నీల్గరే
యీరోజుల్మరి కొంత మారినను ఇంకెంతెంత మార్పందగన్
ప్రేరేపించుడి జ్ఞానులంత జనులన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

97)వడిగా మారెను వృద్ధి రేటు పెరిగెన్ బ్రాణప్రమోదంబులై
యడుగుల్వేయుట మాని వాహనములన్ సానందముందిర్గగా
నిడుముల్వుట్టెను పీల్చు గాలి విషమై యీదేశముంబట్టణాల్
చెడెరా చూడుర యంత్యసౌఖ్యములిడన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

98)భూగర్భంబులు సీల్చినందు వలనన్ భూకంపముల్వుట్టురా
వాగుల్వంకలనాగకుండ విసరన్ వ్యర్థంబులున్ బ్లాస్టికుల్
వేగంబున్ గలుషంబులౌచు జలముల్ పీల్చంగ ప్రాణంబులన్
రేగెన్ మృత్యుకరాళలీల గనుడీ శ్రీకృష్ణ రాధేశ్వరా

99)అరయన్ మానవరూప దానవులుగానమ్మమ్మొ భూతంబులై
చెరపట్టిర్మతమౌఢ్యచిత్తులొకచో శ్రీమాన్య ధర్మంబులన్
నరులన్ జీల్చిరి భేదభావముల నున్మాదమ్మె మోదమ్ముగా
చెరపుల్వుట్టుచు నొండునొండు పొడవన్ శ్రీకృష్ణ రాధేశ్వరా

100) ఆచారంబన మానవత్వ విలువల్ సాహ్లాదసద్భావమం
దాచీదూచుచు మాటలాడు విధముల్ ధర్మానుసారమ్ముగా
వాచామానస కర్మనిష్ఠులగుటల్ ప్రాప్తింపగాఁజేయుచున్
శ్రీచిద్భాగ్య ప్రసాదమద్ది యగురా శ్రీకృష్ణ రాధేశ్వరా

101)భామల్ కోమలులైన గాని తమ వాగ్భాణాలు సంధించుచున్
గామచ్ఛేదక దివ్యయోగమిడుచున్ ఖ్యాతిల్లిరక్కాలమున్
దామే ధారుణినాదిశక్తులగుచున్ ధర్మప్రబోధంబులన్
శ్రీమాధుర్య వసంతకోకిలలుగా శ్రీకృష్ణ రాధేశ్వరా

102)ఏమందున్మనసెంత పిచ్చిదగుచున్ తృష్ణాంబుధిన్ మున్గుచున్
గామోత్పన్నమునంత్యదుఃఖకర పంకంబందు రాగంబనన్
వ్యామోహంబునఁబర్గు వెట్టును గదా యాసూకరంబై కటా
శ్రీమద్గీత విధాత గావుమ ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

103)తరముల్ వేలకు వేలు దొర్లినను అందందందు విన్చున్గనన్
వరుడై స్వార్థము మాని మానకను నిర్వర్తించు సత్కార్యముల్
త్వరగా పేదలనాథలెవ్వరయినన్ దైన్యంబుఁగోల్పోవగన్
స్థిరచిత్తంబునఁబూనుఁగోటికొకడే శ్రీకృష్ణ రాధేశ్వరా

104)చీకాకుల్ నిరతంబుగల్గి జనులంజింతాచితింద్రోయగా
కేకల్వెట్టుచు శోకవహ్ని జవమౌ కీలంబడన్ మాడుచున్
బాకుల్ పాపుల ఘాతుకాల వలనన్ బ్రాణాలకే ముప్పయెన్
శ్రీకాంతా ధర రావదేమి ప్రభువా శ్రీకృష్ణ రాధేశ్వరా

105)ఎంతో కాలము నుండి వేచితిని నన్నీరీతిగా గావ శ్రీ
కాంతానంత వినూత్నలీలకలితా కార్యాత్మకా దైవమా
సంతోషంబుగ నీకృపన్ శతకమున్ సంధిల్లె నీపేర నా
చింతల్దూరము సేసి బ్రోవుమ ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

106)నీపైనన్మరి కొన్ని పద్యములు సంతృప్త్యాత్మునై చెప్పితిన్
నాపాండిత్యము శూన్యమయ్య ప్రభు బృందాలోల నీతత్వమున్
తాపంబణ్గగ నిల్పలేని ఖలు నన్ దామోదరా ప్రేమతో
శ్రీపొంగంగృపఁబ్రోచితీవు ప్రభువా శ్రీకృష్ణ రాధేశ్వరా

107)ఏమో పూర్వ నిగూఢయోగమెదియో యిక్కాల మీలీలగా
స్వామీ నీపయి భక్తి పొంగగను నా జన్మంబు ధన్యంబుగన్
నీమాధుర్యపు నామముల్ ఝరులు నన్నీరీతిగా ముంచుచున్
శ్రీమత్పుణ్యముగల్గఁజేసెను ప్రభూ శ్రీకృష్ణ రాధేశ్వరా

108)మాటల్మాధురులొల్కకుండినను సంప్రాప్తించు సత్ప్రేమతో
నూటల్ భావములూరుచుండగను నాయూహల్ నినున్ నిల్పగన్
బూటల్వూటలుఁగాక కొద్ది తడవే మోదమ్మునంజెప్పితిన్
జేటుల్గల్గిన దిద్దుమయ్య ప్రభువా శ్రీకృష్ణ రాధేశ్వరా

మీ
అవధాని ఐతగోని వెంకటేశ్వర్లు
నల్గొండ